భారత్ – ఆసియాన్ బంధం బలోపేతం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో భారత్ –ఆసియాన్ దేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. మనీలాలో జరిగిన ‘ఆసియాన్ పోస్ట్- మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ విత్ ఇండియా- 2026’ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రత వంటి అంశాలు ప్రపంచ దేశాలకు కీలకంగా మారాయని, సముద్ర మార్గాల భద్రత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమని జైశంకర్ అన్నారు. అంతర్జాతీయ సముద్ర చట్టాలను ప్రతి దేశం గౌరవించాలని, స్వేచ్ఛాయుత, సురక్షిత సముద్ర రవాణా ప్రపంచ స్థిరత్వానికి అవసరమని తెలిపారు.
ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ డీ- రిస్కింగ్, డైవర్సిఫికేషన్ విధానాలను అనుసరించాలని సూచించారు. భారత్ –ఆసియాన్ సంబంధాలు వాణిజ్యానికే పరిమితం కాకుండా సాంకేతికత, డిజిటల్ రంగం, కృత్రిమ మేధస్సు (ఏఐ), హరిత అభివృద్ధి, కనెక్టివిటీ వంటి రంగాలకు విస్తరించాయని చెప్పారు.
ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా జైశంకర్ ఈస్ట్ ఏషియా సమ్మిట్, ఆసియాన్ రీజినల్ ఫోరం, క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొననున్నారు. అలాగే పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

