భేటీ నుంచి విపక్షాల నిష్క్రమణ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఉద్రిక్తంగా ముగిసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నుంచి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. టీఎంసీకి చెందిన తిరుగుబాటు ఎంపీలను సమావేశానికి ఆహ్వానించడాన్ని ప్రధాన కారణంగా చూపుతూ విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. స్పీకర్ ఇంకా వారి సభ్యత్వంపై తుది నిర్ణయం తీసుకోని పరిస్థితిలో వారిని అధికారికంగా సమావేశానికి పిలవడం సరైన విధానం కాదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. టేబుల్ ఆఫీస్ రికార్డుల ప్రకారం టీఎంసీ బలం 28 మంది ఎంపీలేనని, సంఖ్యాబలాన్ని తగ్గించి చూపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసమే సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, జనసేన, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

