Breaking NewsHome Page SliderNationalNewsNews Alert

9వ తరగతిలో మూడో భాష వద్దు: సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల్లో 9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను ప్రవేశపెట్టే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే దశలో విద్యార్థులపై అదనపు భాషను రుద్దడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కొత్త భాషను బోధించాలనుకుంటే 9వ తరగతిలో కాకుండా, ప్రాథమిక దశలోనే అమలు చేయడం మంచిదని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. 8వ తరగతి పూర్తయిన తర్వాత నుంచే విద్యార్థులు బోర్డు పరీక్షలపై దృష్టి పెడతారని, అలాంటి సమయంలో అదనపు విద్యాభారం వేయడం సమంజసం కాదని పేర్కొంది.

తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేలా విద్యా విధానాలను రూపొందించాలని, ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. విద్యా విధానంలో మార్పులు చేపట్టేటప్పుడు విద్యార్థుల అభ్యాస సామర్థ్యం, మానసిక ఆరోగ్యం, విద్యాభారాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.