Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

అల్లూరి జిల్లాలో గిరిజనుల అవస్థలు..-అంబులెన్స్ లేక రేషన్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని తమలం గ్రామంలో ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజనులు తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికావడంతో అత్యవసర వైద్యం అవసరమైంది. ఆశా కార్యకర్త అందించిన మందులతో ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని గ్రామస్తులు నిర్ణయించారు.

అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో 108, 104 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో గ్రామస్తులు రేషన్ బియ్యం పంపిణీ కోసం వచ్చే ఎండీయూ వాహనాన్ని వినియోగించి బాధితులను సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర సమయంలో సహకరించిన ఎండీయూ డ్రైవర్ బచ్చెలి సత్యారావు, యువకుడు అప్పారావును స్థానికులు అభినందించారు.

ఇదిలా ఉండగా, ముంచంగిపుట్టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మందుల కొరత ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో తాగునీటి వనరులు కలుషితమవడం వల్లే గ్రామాల్లో జ్వరాలు, ఇతర వ్యాధులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారులు, వైద్య సదుపాయాలు, తాగునీటి వసతులను ప్రభుత్వం తక్షణమే మెరుగుపరచాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.