Home Page SliderNationalNewsNews AlertTrending Today

సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయ విద్యార్థుల అరెస్ట్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణకు అంతరాయం కలిగించి, భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు న్యాయ విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్నో విశ్వవిద్యాలయం మూడో సంవత్సరం న్యాయ విద్యార్థి ప్రబల్ ప్రతాప్ సింగ్, రాయ్‌బరేలికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి చందర్ భాన్ జులై 10న సుప్రీంకోర్టులో హంగామా సృష్టించారు. ప్రబల్ ప్రతాప్ సింగ్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు.

పిటిషనర్ అయిన ప్రబల్ ప్రతాప్ కోర్టులో న్యాయమూర్తులను దుర్భాషలాడడంతో పాటు కాగితాలు విసిరాడు. అడ్డుకునేందుకు వచ్చిన భద్రతా సిబ్బందిపై ఇద్దరూ దాడిచేసి విధులకు ఆటంకం కలిగించారు. సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కోర్టు సూచనల మేరకు మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరూ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం వారిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి తరలించి, వారి వద్ద ఉన్న అభ్యంతరకర కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.