Home Page SliderNationalNews

రూ.550 కోట్ల వెండి కేసు.. కోర్టు జోక్యం

వైష్ణోదేవి ఆలయానికి భక్తులు సమర్పించిన వెండి కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జమ్మూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.550 కోట్లకు పైగా విలువైన వెండి కానుకల కేసులో దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ అధికారిని అన్ని సంబంధిత రికార్డులతో జులై 29న వ్యక్తిగతంగా హాజరుకావాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మునీశ్ కుమార్ మన్హాస్ ఆదేశించారు.

జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు న్యాయవాది దీపక్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఆలయానికి సమర్పించిన వెండి కానుకల్లో కల్తీ, మార్పిడి, దుర్వినియోగం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, రికార్డుల తారుమారు వంటి ఆరోపణలను కూడా ప్రస్తావించారు.

క్రైమ్ బ్రాంచ్ తగిన చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు దీపక్ శర్మ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఇన్వెంటరీ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, రవాణా పత్రాలు, లోహ స్వచ్ఛత పరీక్ష నివేదికలు తదితర ఆధారాలను పరిశీలించాలని ఆయన కోరారు.

ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఏమిటంటే, ఆలయంలో సేకరించిన సుమారు 20 టన్నుల వెండిని పరీక్షించగా అందులో కేవలం 5 –6 శాతం మాత్రమే స్వచ్ఛమైన వెండి ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. మిగిలిన భాగంలో క్యాడ్మియం, ఇనుము తదితర లోహాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.