ఎల్‌ఐసీ ప్రీమియానికి క్రెడిట్ కార్డు చెల్లింపులు నిలిపివేత
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తన పాలసీదారులకు కీలక సమాచారం వెల్లడించింది. అధికారిక కస్టమర్ పోర్టల్‌తో పాటు ‘LIC Digital’ మొబైల్ యాప్‌లో క్రెడిట్ కార్డు ద్వారా ప్రీమియం చెల్లించే సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
పేమెంట్ గేట్‌వే సంస్థతో కన్వీనియన్స్ ఫీజులు, సర్వీస్ ఛార్జీలకు సంబంధించిన సాంకేతిక లేదా నిర్వహణ అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే, పాలసీదారులు ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రీమియం చెల్లించవచ్చు. యూపీఐ యాప్‌లు (ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం), నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు వంటి సౌకర్యాలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఎల్‌ఐసీ తెలిపింది.
క్రెడిట్ కార్డు చెల్లింపుల సేవను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం పాలసీదారులు ప్రత్యామ్నాయ డిజిటల్ చెల్లింపు విధానాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

