Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

బోటు ప్రమాదంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జగన్

విశాఖపట్నంలో బోటు ప్రమాదంలో బాధితులైన మత్స్యకార కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. జబ్బర్‌తోటలో బాధితులను ఓదార్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినా, సహాయక చర్యలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కోస్ట్‌గార్డ్‌ను రంగంలోకి దించి ఉంటే మరికొందరి ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని అన్నారు. ఘటన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక కూడా వాస్తవాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు.

బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో ప్రభుత్వం బాధితులకు అండగా నిలవాల్సిందని, వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన సాయం సరిపోదని, ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను జగన్ ప్రస్తావించారు. పాకిస్థాన్‌లో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రజల సంక్షేమం కంటే ఇతర అంశాలపైనే దృష్టి పెడుతోందని విమర్శించారు.