Breaking NewsHome Page SliderNewsNews AlertTelangana

రూ.668 కోట్లతో ఈఎస్‌ఐ వైద్య ప్రాజెక్టులు ప్రారంభం

కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.668 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా ఏడు ఈఎస్‌ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ నుంచి వర్చువల్‌గా ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రూ.211.13 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఓపీడీ బ్లాక్‌ను ప్రారంభించారు.

కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో రూపొందించిన ఈ భవనంలో 180 సాధారణ పడకలు, 25 ఐసీయూ పడకలు, 20 ఎన్‌ఐసీయూ పడకలను ఏర్పాటు చేశారు. అలాగే రేడియాలజీ విభాగం, మెడికల్ పునరావాస కేంద్రం, యోగా సౌకర్యాలు వంటి ప్రత్యేక సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రుల మౌలిక వసతుల బలోపేతానికి ఈ ప్రాజెక్టులు కీలకమవుతాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సనత్‌నగర్‌లోని కొత్త ఓపీడీ బ్లాక్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.