Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

నెల్లూరు ఏఓ హత్య కేసు నిందితుడి దారుణం -భార్యాపిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో ప్రధాన వ్యక్తి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారి (ఏఓ) ఎన్. శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన కుడుముల హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. ఆయనతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం, జూన్ 15న హరికృష్ణ తన బావ అయిన ఏఓ శ్రీహరిని పెంచలకోనకు తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే మృతదేహంపై గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసు మళ్లీ విచారణకు వెళ్లింది.

మృతుడి భార్య లావణ్య ఫిర్యాదుతో ఉన్నతాధికారులు కేసును పునర్విచారించగా, ఆస్తి వివాదమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. విచారణ వేగవంతం కావడంతో పరారీలో ఉన్న హరికృష్ణపై పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో హరికృష్ణ తన కుటుంబంతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా వారి వివరాలను గుర్తించారు.

ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్‌కు చెందిన 23 మంది సిబ్బందిని బదిలీ చేయగా, అప్పటి సీఐ మాతంగి శ్రీనివాసరావును వీఆర్‌కు పంపించారు. ఈ ఘటన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర సంచలనం రేపింది.