Home Page SliderNationalNewsNews AlertTrending Today

300 హోటళ్లలో బస.. బిల్లు మాత్రం జీరో

దేశవ్యాప్తంగా 36 ఏళ్లుగా 300కు పైగా ఫైవ్ స్టార్ హోటళ్లను మోసం చేసిన తమిళనాడుకు చెందిన 69 ఏళ్ల బింగ్సన్ జాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. లగ్జరీ హోటళ్లలో బస చేసి, బిల్లు చెల్లించకుండా పరారవడం అతని నిత్యకృత్యంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 1990 నుంచి బింగ్సన్ జాన్ విదేశీ టూరిస్ట్ గైడ్, ఇంగ్లీష్ టీచర్ లేదా యోగా ట్రైనర్ అంటూ తప్పుడు గుర్తింపులతో హోటళ్లలో చెక్- ఇన్ చేసేవాడు. చక్కటి ఇంగ్లీష్, హుందా ప్రవర్తనతో హోటల్ సిబ్బందిని నమ్మించి, కొన్ని రోజులు అన్ని సౌకర్యాలు వినియోగించిన తర్వాత బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయేవాడు. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులను కూడా దొంగిలించేవాడు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ హయత్ హోటల్‌లో రెండు రోజుల పాటు బస చేసి రూ.63,755 బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయాడు. అంతేకాకుండా రూ.1.48 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌ను కూడా అపహరించాడు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో ఒడిశాలోని భువనేశ్వర్‌లో 72 గంటల్లో అతడిని అరెస్టు చేసి, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో 1980లలో ఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసేటప్పుడు ఓ లగ్జరీ హోటల్‌లో జరిగిన అవమానమే తనను ఈ మార్గంలో నడిపిందని బింగ్సన్ జాన్ తెలిపాడు. అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభ్‌రాజ్ నేర శైలిని అనుసరించి నకిలీ గుర్తింపులతో మోసాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కొన్న బింగ్సన్ జాన్ గతంలో సుమారు 15 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం అతనిపై ఉన్న ఇతర కేసుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.