Home Page SliderNationalNewsNews Alert

పుణె, ఢిల్లీలో కూలిన భవనాలు

ముంబయి (ఏడీఎన్ఎన్): మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా రెండు వేర్వేరు చోట్ల పాత భవనాలు కూలి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పుణెలోని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ పరిధిలో వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌కు చెందిన మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవనంలో ఉన్న సుమారు 15 మంది ఉద్యోగులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రెస్క్యూ పనులకు ఆటంకంగా మారుతున్నాయి. వరదల ప్రభావంతో పుణె పరిసర ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఇదే సమయంలో ఢిల్లీలోని రోహిణి సెక్టార్- 16లో భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల పాత భవనం కూలిపోయింది. ప్రమాద సమయంలో భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సర్వీస్, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. రెండు ఘటనల్లోనూ చిక్కుకున్న వారి సంఖ్య, ప్రాణనష్టం వివరాలపై అధికారుల వద్ద నుండి ఒక ప్రకటన రావాల్సి ఉంది.