షెహబాజ్‌పై అమెరికా సెనేటర్ల ఆగ్రహం
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరుకావడంపై అమెరికా సెనేటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫ్లోరిడా సెనేటర్ రిక్ స్కాట్, మొంటానా సెనేటర్ టిమ్ షీహీ పాకిస్తాన్ వైఖరిని తప్పుబట్టారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్‌కు ఉన్న గత సంబంధాలను ప్రస్తావించిన రిక్ స్కాట్, ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిన దేశం పాకిస్తానేనని ఆరోపించారు. ఇరాన్– అమెరికా మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఖమేనీ అంత్యక్రియల్లో షెహబాజ్ షరీఫ్ పాల్గొని ఆయనను గొప్ప నాయకుడిగా కొనియాడిన వీడియోను రిక్ స్కాట్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పాకిస్తాన్ ఒకవైపు మత స్వేచ్ఛపై విమర్శలు ఎదుర్కొంటూనే, మరోవైపు ఖమేనీని ప్రశంసించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ పవిత్ర నగరం ఖోమ్‌లో ఖమేనీ అంతిమయాత్ర భారీగా జరిగింది. వేలాది మంది ప్రజలు పాల్గొని అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. గురువారం ఖమేనీ స్వస్థలం మషద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

