కోల్ బ్లాకులన్నీ సింగరేణికే ఇవ్వాలి
తాడిచర్ల-2 బొగ్గు గని కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఇది కేంద్రం కొత్తగా కేటాయించిన బ్లాక్ కాదని, 2013 సెప్టెంబర్ 16న యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిన కోల్ బ్లాక్ అని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలను పక్కనబెట్టి కొత్త కేటాయింపులా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
మైనింగ్ లీజు కోసం సింగరేణి దరఖాస్తు చేసుకున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు దానిని పెండింగ్లో ఉంచిందని భట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులను కలిసి వాస్తవాలు వివరించడంతోనే ఈ మైనింగ్ లీజు ప్రక్రియ ముందుకు సాగిందని చెప్పారు. ఇది ప్రభుత్వ ప్రయత్నాల ఫలితమేనని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్ సంస్థలకు అవకాశం లేకుండా, ప్రభుత్వ సంస్థలు లేదా గిరిజనులకే మైనింగ్ హక్కులు ఉండాలనే నిబంధనలు ఉన్నాయని భట్టి గుర్తుచేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సత్తుపల్లి, కోయగూడెం కోల్ బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా టెండర్లు నిర్వహించారని ఆరోపించారు.
తాడిచర్ల కోల్ బ్లాక్ లీజు ఆలస్యం కావడంతో సింగరేణికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో గోదావరి పరీవాహక ప్రాంతంలోని అన్ని కోల్ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సింగరేణి అభివృద్ధి, పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

