పాక్‌లో బస్సు బోల్తా.. పలువురు మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బలూచిస్తాన్-ఖైబర్ పఖ్తున్ఖ్వా సరిహద్దులోని దానా సర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానికులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లోయ లోతుగా ఉండటంతో మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ప్రాథమిక విచారణలో, మార్గమధ్యంలో మరో బస్సు చెడిపోవడంతో అందులోని ప్రయాణికులను కూడా ఈ బస్సులో ఎక్కించారని, దీంతో అధిక లోడ్ కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించగా, ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.

