Andhra PradeshBreaking NewsNews

‘మావిగన్’పై జగన్‌కు దుర్గేష్ కౌంటర్

నిడదవోలు: ఐదేళ్లపాటు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపడం హాస్యాస్పదమని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు.

జగన్ తాజా వ్యాఖ్యలపై స్పందిస్తూ విడుదల చేసిన ప్రకటనలో, రాజధాని అనేది ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా అమరావతికి మద్దతిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. రాజధానిని పదేపదే మార్చాలనుకోవడం రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల అంశంపై న్యాయస్థానాలు, ప్రజలు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వెల్లడించినా వైసీపీ అదే వైఖరిని కొనసాగించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల వెనక్కి వెళ్లిన పెట్టుబడులను కూటమి ప్రభుత్వం తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తోందని తెలిపారు.

ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జగన్ 2029 ఎన్నికల గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందుగా ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సంపాదించాలని సూచించిన మంత్రి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.