స్మార్ట్ ట్రాఫిక్ కోసం సర్కార్ బిగ్ డీల్
హైదరాబాద్: నగర ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, స్మార్ట్ మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికతను వినియోగించనుంది. ఈ మేరకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ అన్ లాగ్, మౌలిక వసతుల సంస్థ మెగా ఇంజనీరింగ్తో ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోబోటిక్స్, సెన్సార్ ఆధారిత ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంలను అమలు చేయనున్నారు. దీంతో హైదరాబాద్‌ను ‘కాగ్నిటివ్ సిటీ’గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అంబులెన్స్‌లకు ఆటోమేటిక్ గ్రీన్ కారిడార్, నీటి లీకేజీల ముందస్తు గుర్తింపు, స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లన్నింటినీ ఏఐతో అనుసంధానించి, వాహన రద్దీకి అనుగుణంగా స్వయంచాలకంగా పనిచేసే వ్యవస్థను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలు, అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించడంలో ఈ వ్యవస్థ కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

