ఉస్మానియాలో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు వైద్యరంగంలో అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే తొలిసారిగా ఒక రోగికి ఒకేసారి ఐదు అవయవాల (మల్టీ- విసెరల్) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ క్లిష్ట ఆపరేషన్ విజయవంతం కావడం విశేషంగా నిలిచింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌కు కడుపు, డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు పూర్తిగా దెబ్బతినడంతో వైద్యులు ఒకేసారి ఐదు అవయవాలను మార్పిడి చేశారు. అత్యంత సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్స సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా సాగింది.
ఈ విజయంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేసిన వైద్యులు, అనస్థీషియా, నర్సింగ్, క్రిటికల్ కేర్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించగల సామర్థ్యం ఉందని ఉస్మానియా వైద్య బృందం మరోసారి నిరూపించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

