పోలీస్ స్టేషన్‌లో భద్రతా వైఫల్యమా?
హైదరాబాద్: మణికొండలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్నాడనే సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ముజఫర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు.
అయితే మంగళవారం అర్ధరాత్రి సమయంలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఉన్న ముజఫర్, పోలీసుల దృష్టి తప్పించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు.
అత్యంత భద్రత ఉండే పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు ఎలా తప్పించుకున్నాడనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. స్టేషన్‌లో భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా? విధుల్లో నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, పరారైన ముజఫర్‌ను పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

