Home Page SliderNewsNews AlertTelangana

రైతుల ఆగ్రహం తప్పదు: కేటీఆర్

తెలంగాణ చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచిపోతే, సీఎం రేవంత్ రెడ్డి రైతు ద్రోహిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా నిధులను విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తోందని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.

గత 30 నెలల్లో రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.30 వేల కోట్ల రైతుభరోసా నిధులు బకాయి పెట్టిందని, ఇప్పుడు సభల పేరుతో ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. రైతులకు దక్కాల్సిన సాయాన్ని నాలుగుసార్లు నిలిపివేసిన విషయాన్ని వారు మర్చిపోరని హెచ్చరించారు.

ఎకరానికి ఏడాదికి రూ.15 వేల సాయం ఇస్తామని హామీ ఇచ్చి, చివరకు అరకొర సాయం మాత్రమే అందించారని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేశారని, యూరియా కొరత వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం సభలు నిర్వహిస్తోందని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో 11 విడతల్లో రూ.73 వేల కోట్ల రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తుచేసిన కేటీఆర్, రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.