2028లో బీఆర్ఎస్‌దే అధికారం: కేటీఆర్
వికారాబాద్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. 2028లో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్‌కు “ఖేల్ ఖతం.. దుకాన్ బంద్” పరిస్థితి తప్పదని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు అభివృద్ధి పేరుతో భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించిన కేటీఆర్, రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.
కేసీఆర్ హయాంలో జిల్లాల ఏర్పాటు, మెడికల్ కళాశాలలు, సాగునీటి ప్రాజెక్టులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కోసం చెట్ల నరికివేతను కూడా ఆయన తప్పుబట్టారు. సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

