కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి
రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే కాంగ్రెస్ పాలన పోయి, కేసీఆర్ పాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం రాజేంద్రనగర్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కంటే విధ్వంసమే ధ్యేయంగా పాలన సాగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టేస్తూ, సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించిన కేటీఆర్, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో ‘మాఫియా రాజ్యం’ నడుస్తోందని ఆరోపించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీని ‘దండుపాళ్యం బ్యాచ్’గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన కంటే ప్రతిపక్షాలపై బూతులు మాట్లాడటం, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, హైడ్రా పేరుతో వేల సంఖ్యలో పేదల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సినిమా అయితే, అది ఇప్పటికే సగం పూర్తయి ‘అట్టర్ ఫ్లాప్’ అయిందని ఎద్దేవా చేసిన ఆయన, సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు నష్టం జరుగుతుందని, కానీ రేవంత్ రెడ్డి పాలన వల్ల మొత్తం తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలను దారుణంగా మోసం చేశారని, నియోజకవర్గంలో కనీసం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

