Andhra PradeshHome Page Sliderhome page sliderNews

రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం

మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది రూ.19 వేలే..
పంటల బీమా రద్దు – ధరల స్థిరీకరణకు ఎగనామం
ఆక్వా, మామిడి, పొగాకు రైతులను నట్టేట ముంచారని ధ్వజం
ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీత

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని నిలువునా మోసం చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులపై చంద్రబాబు చూపిస్తున్న ప్రేమ కేవలం బూటకమని, ఆయన చేస్తున్నది పచ్చి మోసమని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడిపై సుదీర్ఘమైన ట్వీట్ చేస్తూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై లెక్కలతో సహా నిలదీశారు. చంద్రబాబూ.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా అన్నీ మోసాలేనని జగన్ మండిపడ్డారు.ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా పీఎం-కిసాన్‌కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తానని ప్రకటించి, చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారని జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలానికి సంబంధించిన లెక్కలను ఆయన ప్రస్తావిస్తూ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇస్తానన్న 20,000 రూపాయలను పూర్తిగా ఎగరగొట్టి రైతులకు సున్నా ఇచ్చారని విమర్శించారు. అలాగే 2025-26లో 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 14,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఇక 2026-27లో ఇవ్వాల్సిన 26,000 రూపాయలలో ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు మాత్రమేనని లెక్కగట్టారు. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి 60,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం 19,000 రూపాయలు మాత్రమేనని స్పష్టం చేశారు. పైగా తమ హయాంలో 53.58 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, కూటమి ప్రభుత్వం దాన్ని 46.85 లక్షల మందికి కుదించి, 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించిందని, కౌలు రైతులకు, గిరిజనులకు మొండిచేయి చూపిందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమాను రద్దు చేసిందని, దాంతో రైతులు సొంతంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సి వస్తోందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ప్రీమియం కట్టినా, ప్రభుత్వం తన వంతు వాటా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. తమ హయాంలో రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే 7,802 కోట్ల రూపాయలు పంటల బీమా కింద ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే ఏ సీజన్ నష్టం అదే సీజన్ లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఆపేశారని, మోంథా తుపాను వచ్చి 8 నెలలు దాటుతున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క పైసా అందలేదని విమర్శించారు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్‌ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఏ పంటకూ గట్టుబాటు ధర లేదని, ధరల స్థిరీకరణ నిధికి కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టిందని జగన్ విమర్శించారు. వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, మిర్చి, పొగాకు, టమోటా వంటి పంటల ధరలు పడిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ముఖ్యంగా ఆక్వా రైతులను నట్టేట ముంచారని, అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరి , జూన్ నెలల్లో కలిపి కిలో ఆక్వాఫీడ్ ధరను ఏకంగా 14 రూపాయల నుంచి 16 రూపాయల వరకు పెంచేశారని మండిపడ్డారు. మరోవైపు రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయని, పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే కరెంట్ సబ్సిడీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మామిడి రైతులకు గత ఏడాది ప్రకటించిన 380 కోట్ల రూపాయల బకాయిలను ఇప్పటికీ ఎగ్గొట్టారని, మళ్లీ ఈ ఏడాది కిలోకు 4 రూపాయలు ఇస్తామంటూ మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు ధరలు కుప్పకూలిపోయి రైతులు ట్రాక్టర్లతో ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని, చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం,నిరాశ మాత్రమేనని వైఎస్ జగన్ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.