Home Page Sliderhome page sliderInternational

ఈ తాబేలు వయసు..194 ఏళ్లు!

  • ప్రపంచ రికార్డుల రారాజు
  • జోనాథన్..‘గిన్నిస్ ఐకాన్’

భూమిపై జీవిస్తున్న అత్యంత వృద్ధ ప్రాణిగా చరిత్ర సృష్టించిన ‘జోనాథన్’ అనే తాబేలు తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనిని అధికారికంగా తన ‘ఐకాన్ 2026’ జాబితాలో చేర్చింది. ప్రస్తుతం 194వ ఏట అడుగుపెట్టిన ఈ తాబేలు.. ప్రపంచంలోనే అత్యంత పురాతన భూచర జీవిగా తన రికార్డును మరింత సుస్థిరం చేసుకుంటూ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెషెల్స్ జెయింట్ జాతికి చెందిన ఈ తాబేలు 1832లో జన్మించినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ జాతి తాబేళ్లు 150 ఏళ్లు మాత్రమే జీవిస్తాయి. కానీ జోనాథన్ ఆ పరిమితిని దాటి శతాబ్దాలుగా జీవిస్తోంది. టెలిఫోన్ ఆవిష్కరణ, బ్రిటన్ రాణి విక్టోరియా పాలన, ఈఫిల్ టవర్ నిర్మాణం, ఇంటర్నెట్ యుగం వంటి ప్రపంచాన్ని మార్చిన ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ తాబేలు సజీవ సాక్ష్యంగా నిలవడం విశేషం. ప్రస్తుతం దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని ‘సెయింట్ హెలెనా’దీవిలో నివసిస్తున్న జోనాథన్ సుదీర్ఘ ఆయుష్షు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు రెండు శతాబ్దాలుగా ఇది ఎలా ఆరోగ్యంగా జీవించగలుగుతుందో తెలుసుకునేందుకు పరిశోధకులు దీని డీఎన్‌ఏ, కణాల నిర్మాణాన్ని అధ్యయనం చేస్తున్నారు. మానవుల వృద్ధాప్యం, జీవన కాలంపై జరిపే పరిశోధనలకు దీని జీవశాస్త్రం ఎంతో కీలక సమాచారాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.