Breaking NewsEducationhome page sliderHome Page SliderTelangana

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆకస్మిక రాజీనామా!

తెలంగాణ ప్రభుత్వ విద్యా వర్గాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, కీలక సంస్కరణల కోసం ప్రభుత్వం ఈ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి, దానికి చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించింది. అయితే, ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే, ముందే ఈ పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తన రాజీనామాకు గల కారణాన్ని ఆకునూరి మురళి సీఎస్‌కు పంపిన లేఖలో స్పష్టంగా వివరించారు. ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను, నిర్దేశించిన పనిని తాను విజయవంతంగా పూర్తి చేశానని ఆయన అందులో పేర్కొన్నారు. బాధ్యత పూర్తిగా నెరవేరినందున సంతోషంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిరంతరం గళమెత్తే ఆకునూరి మురళి.. కమిషన్ చైర్మన్‌గా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రభుత్వానికి ఇప్పటికే పలు కీలక సిఫార్సులు చేశారు.

అయితే, ఇంకా నాలుగు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయన తప్పుకోవడం వెనుక కేవలం పని పూర్తి కావడమే కారణమా, లేక అంతర్గతంగా మరేదైనా సమీకరణాలు లేదా అసంతృప్తులు ఉన్నాయా అన్న కోణంలో విద్యా వర్గాల్లో భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. నిక్కచ్చిగా మాట్లాడే అధికారిగా పేరున్న మురళి రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఆకస్మిక పరిణామంపై అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.