ఐపీఎల్ ఫ్యాన్స్ జాగ్రత్త.. ఫేక్ టిక్కెట్లతో సైబర్ దందా!
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మ్యాచ్ టిక్కెట్లకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను వాడుకుంటూ సామాన్య క్రికెట్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) మరియు మల్కాజ్గిరి పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా అధికారిక హెచ్చరికలు జారీ చేశాయి.
అధికారిక బుకింగ్ భాగస్వామి అయిన జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌ను పోలిన నకిలీ వెబ్సైట్లు, డూప్లికేట్ అప్లికేషన్లను సృష్టించి కేటుగాళ్లు లింకులను సర్క్యులేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తాము “VIP పాసులు”, “లాస్ట్ మినిట్ తత్కాల్ టిక్కెట్లు” ఇస్తామంటూ నకిలీ స్క్రీన్షాట్లతో నమ్మిస్తున్నారు. ఆ తర్వాత యూపీఐ, క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బులు వసూలు చేసి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడం లేదా నకిలీ ఈ-టికెట్లు పంపడం చేస్తున్నారు.
అధికారిక జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ మినహా ఎలాంటి థర్డ్-పార్టీ యాప్స్ లేదా అపరిచిత వ్యక్తుల సాషల్ మీడియా అకౌంట్లను నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు. తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ లింకులపై క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఐపీఎల్ టిక్కెట్ల పేరుతో మోసపోతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

