Editorial Newshome page sliderPoliticsTelangana

బీఆర్ఎస్ రజతోత్సవ వేళ “పునరాగమన పరీక్ష” భవిష్యత్‌పై సందిగ్ధం!

తెలంగాణ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా నడిపించిన కల్వకుంట్ల కుటుంబం… ఒకప్పుడు నిర్ణయమే దిశగా మారిన నాయకత్వం… అదే కుటుంబం ఇప్పుడు ప్రశ్నల ముసురులో నిలిచింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత నిశ్శబ్దంలోకి జారిన నాయకత్వం, తలోదారి పడుతున్న కీలక నేతలు, భవిష్యత్ వారసత్వంపై అంతర్గత సందిగ్ధం—ఈ సమీకరణాలన్నీ కలిసొచ్చి బీఆర్ఎస్‌ను అమాంతం కిందకు తీసుకువచ్చాయి. 25 ఏళ్ల ప్రస్థానం జరుపుకుంటున్న ఈ సమయంలోనే పార్టీకి దిశ ఏంటి? కుటుంబంలో ఏకత్వం మాటేమిటి? టీఆర్ఎస్ఏ పార్టీ స్థాపించి, ఇది కొత్త రాజకీయ పునర్‌వ్యవస్థీకరణకు సంకేతమని కవిత చెప్పకనే చెప్పింది. మరి కేటీఆర్, హరీశ్ రావుల పరిస్థితి ఏంటో అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో కేంద్రబిందువయ్యాయి.

తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం చుట్టూ రాజకీయ కథనాలు నడిచేవి, తెలంగాణ రాజకీయాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా కీలకంగా ఉంది. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే—పార్టీ లోపలి మార్పులు, నాయకత్వంలో స్తబ్దత, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపం—ఈ కుటుంబ రాజకీయ ప్రభావం ఒక మలుపు తిరోగమన దశలోకి చేరిందా అన్న ప్రశ్నలు సహజంగా తలెత్తుతున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఒక ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర నిర్మాణ శిల్పిగా చరిత్రలో నిలిచిపోయారు. కానీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన రాజకీయ చురుకుదనం తగ్గినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రతి అంశంపై స్పందించే కేసీఆర్, ఇప్పుడు ఎక్కువగా మౌనం పాటించడం పార్టీ కేడర్‌లో అయోమయాన్ని కలిగిస్తోంది. ఇది నాయకత్వ లోపంగా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది. పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చిన తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆ వ్యూహం ఫలించలేదు. రాష్ట్రంలోనే పట్టు తగ్గడంతో నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల “తలోదారి” పరిస్థితి ఏర్పడింది. పార్టీ పేరు మార్పు తర్వాత కేసీఆర్ నుంచి ఆశించిన దూకుడు కనిపించలేదు. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని భావించినప్పటికీ, ఆ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఫలితంగా పార్టీకి స్పష్టమైన దిశ కనిపించకుండా పోయింది. జోగినిపల్లి సంతోష్ రావు ఒకప్పుడు పార్టీ ఆర్గనైజేషనల్ కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నారు. కానీ ఇటీవల ఆయన ప్రాధాన్యం తగ్గినట్లు తెలుస్తోంది. అంతర్గత రాజకీయాల్లో మార్పులు, కుటుంబంలో నిర్ణయాల కేంద్రీకరణ దీనికి కారణంగా భావిస్తున్నారు. తన్నీరు హరీశ్ రావు పార్టీకి గ్రౌండ్ లెవెల్‌లో బలమైన నాయకుడు. కానీ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం పార్టీ పునర్‌వ్యవస్థీకరణలో ఆయన పాత్ర ఏమవుతుందో అన్నది కీలకం. చాలా మంది కేడర్ ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పార్టీ భవిష్యత్తుగా భావించబడుతున్నా, ఆయన నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించే పరిస్థితి ఇంకా రాలేదు. 2029 ఎన్నికలు ఆయనకు కీలక పరీక్షగా మారే అవకాశం ఉంది. కానీ అప్పటివరకు పార్టీని ఏకతాటిపై ఉంచగలరా అన్నది ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 2001లో ప్రారంభమై తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, 2014లో అధికారంలోకి వచ్చింది. ఆ దశలో పార్టీకి అపారమైన ప్రజా మద్దతు లభించింది. అది కుటుంబ నాయకత్వం వల్లే సాధ్యమైంది. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత పార్టీ తన మూలాల నుంచి దూరమైందనే విమర్శలు వచ్చాయి. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం వల్ల రాష్ట్ర సమస్యలపై ఫోకస్ తగ్గిందని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపింది. కల్వకుంట్ల కవిత ఇటీవల రాజకీయంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె కొత్త పార్టీని టీఆర్ఎస్(ఏ) గా ప్రకటించి సంచలనం సృష్టించింది, కుటుంబ రాజకీయాల్లో విభేదాలు మరింత పెరిగాయి అనుకోవడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. పార్టీ ప్రకటన సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరమనిషిలా మారాడని కామెంట్ చేసింది. అంతకు ముందు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌కు ఇంకా బలమైన కేడర్ ఉన్నప్పటికీ, నాయకత్వంపై స్పష్టత లేకపోవడం వల్ల వారి ఉత్సాహం తగ్గింది. కేడర్‌ను మళ్లీ చైతన్యపరచడానికి బలమైన వ్యూహం అవసరం. పార్టీలో అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నా, వారి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవడం ఒక ప్రధాన సమస్య. అంతర్గత సమన్వయం లోపం దీనికి కారణం. బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరగాల్సిన సందర్భంలో, అవి కొద్దిమందికే పరిమితం కావడం పార్టీ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఇది కేడర్‌లో నిరుత్సాహాన్ని పెంచే అవకాశం ఉంది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ప్రభావం కోల్పోలేదు. కానీ గతంలో ఉన్న అగ్రస్థానం మాత్రం సవాళ్లను ఎదుర్కొంటోంది. నాయకత్వంలో స్పష్టత, కుటుంబంలో ఐక్యత, కేడర్‌కు దిశా నిర్దేశం—ఈ మూడు అంశాలు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. 2029 ఎన్నికలు ఈ కుటుంబానికి “పునరాగమన పరీక్ష”గా మారే అవకాశం ఉంది.