Home Page SliderTelangana

ప్రజావాణి ఇక గ్రామాల్లోకి…

రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజావాణి’ సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌కో లేదా జిల్లా కేంద్రాలకో రావాల్సిన అవసరం లేకుండా, నేరుగా వారి సమీప ప్రాంతాల్లోనే అర్జీలు ఇచ్చుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ఇందులో భాగంగా మొదట రెవెన్యూ డివిజన్ స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో ప్రజావాణిని ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు.ప్రజావాణి ద్వారా అందే ప్రతి ఫిర్యాదుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని, పరిష్కార ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని సీఎం స్పష్టం చేశారు. అర్జీల నమోదు, ట్రాకింగ్, పరిష్కారం కోసం ఒక ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, ఎప్పుడు పరిష్కారమవుతుంది అనే విషయాలను అర్జీదారుడికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ఒక నిర్ణీత గడువును నిర్ణయించి, ఆ గడువులోగా పని పూర్తికాకపోతే బాధ్యులైన అధికారులను జవాబుదారీ చేయాలని ఆదేశించారు.పాలనను మరింత చేరువ చేసే క్రమంలో ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని సీఎం సూచించారు. ఒకవేళ ఒక స్థాయి అధికారి వద్ద సమస్య పరిష్కారం కాకపోతే, అది ఆటోమేటిక్‌గా పైస్థాయి అధికారికి వెళ్లేలా ‘ఆటో ఎస్కలేషన్’ వ్యవస్థను తీసుకురావాలని తెలిపారు. అవసరమైతే అప్పీల్ చేసుకునే సదుపాయం కూడా ఉండాలన్నారు. ఈ వికేంద్రీకరణ వల్ల జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, ప్రజలకు ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.