News

బీఆర్ఎస్ కు ఆత్మ లేదు.. ఆ బంధం తెగిపోయింది

తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన బీఆర్ఎస్, కాలక్రమేణా తన పేరును, పనితీరును, ఆత్మను మార్చుకుందని కవిత విమర్శించారు. పార్టీ తన మూల సిద్ధాంతం నుంచి పక్కకు తప్పుకోవడం వల్లే ప్రజలతో ఉన్న పేగు బంధం తెగిపోయిందని వ్యాఖ్యానించారు. సిద్ధాంతం లేని పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని ఆమె హెచ్చరించారు. తెలంగాణలో ప్రజల సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని, ఆకాంక్షలు నెరవేరలేదని కవిత పేర్కొన్నారు. వాటిని సాధించడమే తమ కొత్త పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణకు ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడే ఒక స్వచ్ఛమైన ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని, ఆ దిశగానే తమ అడుగులు ఉంటాయని ఆమె ప్రకటించారు. కొత్త పార్టీ దిశగా కవిత వేస్తున్న అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ పక్కదారి పట్టడం వల్లే ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు మళ్లీ క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చిందని, తమ పార్టీ ఆ లోటును భర్తీ చేస్తుందని ఆమె గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు.