BusinessHome Page SliderNationalNews Alert

గ్యాస్ సెగకు ‘ఇండక్షన్’ మందు

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వేళ, దేశీయంగా ఇంధన భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్లాన్-బి’ని సిద్ధం చేసింది. వంటగ్యాస్ సెగకు ఇండక్షన్ మందుతో చెక్ పెడుతోంది. LPG సరఫరాలో ఏర్పడే అస్థిరతను అధిగమించేందుకు, ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ కుక్‌ టాప్‌ లను సామాన్యులకు చేరువ చేసేలా భారీ రాయితీలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇండక్షన్ కుక్‌ టాప్‌ లపై ఉన్న 18 శాతం జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. వీటి తయారీకి అవసరమైన విడిభాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం ద్వారా తయారీ వ్యయం తగ్గించాలని యోచిస్తోంది. ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే మార్కెట్లో ఇండక్షన్ స్టవ్‌ ల ధరలు గణనీయంగా తగ్గి, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను పెంచేందుకు తయారీదారులకు ప్రభుత్వం పలు మినహాయింపులు ఇచ్చింది. విద్యుత్ ఉపకరణాలపై తప్పనిసరి నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల అమలును 2026 అక్టోబర్ వరకు పొడిగించింది. దీనివల్ల ఉత్పత్తి ప్రక్రియలో ఆటంకాలు తొలగి మార్కెట్‌ లోకి నిరంతరాయంగా ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంది.