Home Page SliderNationalNewsSports

టీమిండియాపై సెలబ్రిటీల ప్రశంసల జల్లు!

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన అద్భుత విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలవడంతో సినీ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ నటీనటులు టీమిండియాకు అభినందనలు తెలుపుతున్నారు.
“ఏమా ప్రదర్శన! టీమిండియా ఆధిపత్యానికి ఇది నిదర్శనం. 140 కోట్ల భారతీయుల కల నిజమైంది. శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, బుమ్రా.. ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. చరిత్ర పుటల్లో భారత్ మరోసారి మెరిసింది” అంటూ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఎక్స్‌ వేదికగా ప్రశంసించారు.
“మన మెన్ ఇన్ బ్లూ ప్రశాంతత, పట్టుదల, ఆధిపత్యంతో ఈ టోర్నీని గెలిచారు. ట్రోఫీని మళ్ళీ ఇంటికి తెచ్చి చరిత్ర సృష్టించారు. ఈ రాత్రి దేశమంతా ప్రశాంతంగా నిద్రిస్తుంది” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. టీమిండియా విజయం దేశానికి గర్వకారణమని, ఆటగాళ్ల కృషి వెలకట్టలేనిదని పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.
బాలీవుడ్ ప్రముఖులు అనిల్ కపూర్, అజయ్ దేవగణ్, అనుష్కశర్మ, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు టీమిండియా సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని కొనియాడారు. ఈ విజయం పట్ల అందరూ గర్వం వ్యక్తం చేస్తున్నారు.