Breaking Newshome page sliderHome Page SliderTelangana

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘం

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పదని బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా లోకానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు . దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడి ఉందని పేర్కొన్నారు.సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించవలసిన బాధ్యతను ప్రకృతి స్త్రీకి కేటాయించిందని కేసీఆర్ వివరించారు. అనేక కష్టాలతో మానవ మనుగడను నిలబెట్టే ప్రత్యేకమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ప్రతి మహిళా త్యాగశీలేనని ప్రశంసించారు. ఆకాశంలో సగం తానై అపారమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్న మహిళలకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.మహిళలకు పురుషుడితో సమానమైన అవకాశాలను మరింతగా అందించినప్పుడే కుటుంబాభివృద్ధి సంపూర్ణంగా జరుగుతుందని మాజీ సీఎం అభిప్రాయపడ్డారు. స్త్రీలకు సమానమైన అవకాశాలు ఇచ్చినప్పుడు సమాజం మరింతగా పరిఢవిల్లుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా సాధికారతే లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా మహిళా సాధికారతను మరింత పెంచేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. స్త్రీల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు తోడ్పడే పథకాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల శ్రమకు తగిన గుర్తింపు లభించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని కేసీఆర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.