home page sliderHome Page SliderInternationalNews

ట్రంప్ హత్యకు ఇరాన్ స్కెచ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు నిక్కీ హేలీలను లక్ష్యంగా మట్టుపెట్టేందుకు ఇరాన్ గూఢచారుల పన్నాగం బట్టబయలైంది. వారిని చంపేందుకు నన్ను నియమించుకున్నారని 47 ఏళ్ల పాకిస్తాన్ కు చెందిన ఆసిఫ్ మర్చంట్ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అంగీకరించాడు. ఈ కుట్ర వెనుక ఇరాన్ యొక్క ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ హస్తం ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలు ధృవీకరిస్తున్నాయి. తన కుటుంబాన్ని చంపేస్తామని ఇరాన్ ఏజెంట్లు బెదిరించడం వల్లే తాను ఈ నేరానికి ఒప్పుకోవాల్సి వచ్చిందని మర్చంట్ కోర్టు ముందు వాపోయాడు.

ఆగస్టు 2024లో అమెరికాను విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మర్చంట్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదం, కాంట్రాక్ట్ హత్యల కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదయ్యాయి. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ కుట్ర జరగడం అమెరికాలో కలకలం రేగింది. ఇరాన్ తన పాత కక్షలను తీర్చుకోవడానికి విదేశీయులను, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఎలా వాడుకుంటుందో ఈ ఉదంతం అద్దం పడుతోంది.

గతంలో బ్యాంకర్‌గా పనిచేసి, తర్వాత అరటిపండ్ల వ్యాపారంలో భారీ నష్టాలు చవిచూసిన ఆసిఫ్ మర్చంట్‌ను ఇరాన్ గూఢచారులు పావుగా వాడుకున్నారు. 2024 ఏప్రిల్‌లో మెహర్దాద్ యూసుఫ్ అనే ఐఆర్‌జీసీ సభ్యుడు మర్చంట్‌ను కలిసి అమెరికాలో హత్యలు చేయాలని, పలు ముఖ్య పత్రాలను దొంగిలించాలని ఆదేశించాడు. ఇరాన్‌లో ఉన్న మర్చంట్ బంధువులపై ఒత్తిడి తేవడమే కాకుండా, తనను కలిసినప్పుడు యూసుఫ్ ఆయుధాన్ని చూపి భయపెట్టాడని నిందితుడు కోర్టుకు వివరించాడు. “నాకు వేరే మార్గం లేదు, నా కుటుంబం ప్రాణాలు ప్రమాదంలో ఉండటంతోనే ఈ కుట్రలో భాగస్వామినయ్యాను” అని న్యాయమూర్తి ముందు మర్చంట్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఈ కుట్రను అమలు చేసే క్రమంలో మర్చంట్ జూన్ 2024లో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న ఒక బడ్జెట్ హోటల్‌లో కొంతమందితో సమావేశమయ్యారు. ఆయన కలిసిన వారు అసలైన నేరస్తులు కాకుండా, మారువేషంలో ఉన్న ఇద్దరు ఎఫ్‌బీఐ ఏజెంట్లు. ట్రంప్‌ను హతమార్చడానికి అడ్వాన్స్‌గా వారికి 5,000 డాలర్లు (సుమారు రూ. 4.2 లక్షలు) చెల్లించినట్లు మర్చంట్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ సమావేశానికి సంబంధించిన దృశ్యాలు ఎఫ్‌బీఐ నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి. తొలుత ఒక రిపబ్లికన్ నేతను చంపాలని ప్లాన్ చేసినట్లు భావించినా, నిందితుడు ఇచ్చిన పేర్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రధానంగా ఉండటంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతుండగా, ఇరాన్ గూఢచారి వ్యవస్థల నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో అమెరికా నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి.