Breaking NewsNewsTelangana

సిట్ విచారణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠ వీడింది. సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో అధికారుల ముందుకు వచ్చేందుకు ఆయన అంగీకరించారు. పార్టీ నేతలు, లీగల్ టీమ్‌తో శనివారం జరిపిన సుదీర్ఘ చర్చల తర్వాత భేషజాలకు పోకుండా చట్టపరంగానే తేల్చుకోవాలని గులాబీ బాస్ నిర్ణయించుకున్నారు. దీంతో రేపు మధ్యాహ్నం కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు.

సిట్ విచారణ పై తొలుత భిన్న వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో విచారించాలని కేసీఆర్ లేఖ రాయగా, సాంకేతిక , భద్రతా కారణాల దృష్ట్యా సిట్ అధికారులు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఈ కేసులో కీలకమైన ఎలక్ట్రానిక్ ఆధారాలు, సున్నితమైన డాక్యుమెంట్లను ఫామ్ హౌస్‌కు తరలించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. అసెంబ్లీ రికార్డుల్లోనూ, ఎన్నికల అఫిడవిట్‌లోనూ అధికారిక చిరునామాగా ఉన్న నందినగర్ నివాసంలోనే విచారణ జరుపుతామని తేల్చి చెప్పారు. దీంతో కేసీఆర్ కూడా అధికారుల షరతులకు అంగీకరించి, రేపు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.