Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

కన్నకూతురే కర్కశంగా చంపేసింది

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఒక కూతురు తన ప్రేమ కోసం కన్నతల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చింది. నిందితురాలు సురేఖ సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ, అక్కడ ఒక యువకుడితో ప్రేమలో పడింది. అయితే వీరి ప్రేమకు తల్లిదండ్రులు దశరథ్, లక్ష్మి అంగీకరించలేదు. అంతేకాకుండా, ఆమెకు మరొకరితో పెళ్లి నిశ్చయించేందుకు పెళ్లిచూపులు కూడా ఏర్పాటు చేశారు.పెళ్లిచూపుల నుంచి తప్పించుకోవాలని, తన ప్రేమను దక్కించుకోవాలని భావించిన సురేఖ ఘోరమైన ప్లాన్ వేసింది. ఆదివారం నాడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, వారికి ఉన్న మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మబలికింది. తాను నర్సు కావడంతో వారు ఆమెను పూర్తిగా నమ్మారు. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, నొప్పుల మందు అని చెప్పి వారికి విషం ఇంజక్షన్లను ఇచ్చింది.తల్లిదండ్రులు మరణించిన తర్వాత, ఏమీ తెలియనట్లుగా సురేఖ తన సోదరుడు అశోక్‌కు ఫోన్ చేసింది. తల్లిదండ్రులు స్పృహతప్పి పడిపోయారని నమ్మించే ప్రయత్నం చేసింది. తొలుత అప్పుల బాధతో వారు ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. సురేఖ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు గట్టిగా విచారించగా, తనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది.