InternationalNews

హెచ్ 1బీ దరఖాస్తుదారులకు యూఎస్ షాక్ ..

హెచ్‌–1బీ వీసా దరఖాస్తుదారులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. హెచ్‌–1బీ వీసాల స్టాంపింగ్‌ ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చికి వాయిదా వేసిన స్టాంపింగ్‌ అపాయింట్‌మెంట్లు తాజాగా వచ్చే ఏడాది 2027 మధ్య నాటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా వెళ్లాల్సిన వేలాది మంది భారతీయ వృత్తి నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరికైతే ఉద్యోగాలు కొల్పోయే ప్రమాదం ఉంది.

గత ఏడాది చివర్లో మొదలైన ఈ జాప్య సమస్య ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. వాస్తవానికి డిసెంబర్‌ 2025లో తొలిసారిగా హెచ్‌–1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలలో ఆలస్యం కనిపించింది. అప్పట్లో ఉన్న అపాయింట్‌మెంట్లను మార్చి 2026కు మార్చారు. ఆ తర్వాత అదే అపాయింట్‌మెంట్లు అక్టోబర్‌ 2026కు వెళ్లాయి. ఇప్పుడు తాజా పరిస్థితిలో, చాలా అపాయింట్‌మెంట్లు నేరుగా 2027 మధ్య నాటికి వాయిదా పడినట్లు వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి.

ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతం కొత్త వీసా ఇంటర్వ్యూ స్లాట్లు దాదాపుగా లేవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తీసుకున్న అపాయింట్‌మెంట్లను కూడా సగటున 15 నుంచి 18 నెలల తర్వాతకు మార్చాల్సి వస్తోంది. ఫలితంగా, అపాయింట్‌మెంట్ తీసుకున్న వారికి ఈమెయిల్స్‌ ద్వారా తేదీల మార్పు సమాచారం అందుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇమిగ్రేషన్ నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘వీసా స్టాంపింగ్ కోసం ఇప్పుడే భారత్‌కు రావద్దు’ అని అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు సూచిస్తున్నారు. హ్యూస్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్ సంస్థ భాగస్వామి ఎమిలీ న్యూమన్ మాట్లాడుతూ, గత 50 రోజులుగా భారత్‌లో కొత్త వీసా ఇంటర్వ్యూ స్లాట్లు కనిపించలేదని తెలిపారు. అపాయింట్‌మెంట్ దొరకక చాలా మంది ప్రయత్నాలే మానేస్తున్నారని చెప్పారు.

అమెరికన్ బజార్ వెబ్‌సైట్ కథనం ప్రకారం, సాధారణ వీసా స్టాంపింగ్ అపాయింట్‌మెంట్లు 2027 వరకు అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని పేర్కొంది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన కొందరికి కూడా ఇంటర్వ్యూలు రద్దయినట్లు సమాచారం. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్‌మెంట్లు ఉన్న వారికి సైతం, ఏడాది తర్వాతి తేదీలను కేటాయిస్తూ ఈమెయిల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ జాప్యాల ప్రభావం వేలాది కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. కొందరి భార్యాభర్తలు, పిల్లలు అమెరికాలో ఉండగా, తల్లిదండ్రులు భారత్‌లోనే చిక్కుకుపోయారు. ఉద్యోగ ఒప్పందాలు, హౌసింగ్ అగ్రిమెంట్లు, లీజులు వంటి వాటిలోనూ సమస్యలు మొదలయ్యాయి. వీసా గడువు ముగిసిన కొందరికి కంపెనీలు పొడిగింపులు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా నెలకొంది.
ఈ క్రమంలో కొత్త హెచ్‌–1బీ వీసాల పరిస్థితి కూడా అంత అనుకూలంగా లేదు. లక్ష డాలర్ల వరకు ఫీజులు ఉండటంతో చాలా కంపెనీలు కొత్త దరఖాస్తులకు వెనుకాడుతున్నాయి.

ఇతర దేశాల్లోని అమెరికా కాన్సులేట్లలో భారతీయులు వీసా స్టాంపింగ్ చేయించుకునే అవకాశాన్ని నిలిపివేయడంతో మొత్తం భారం భారత్‌లోని కాన్సులేట్లపైనే పడింది. దీంతో అపాయింట్‌మెంట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హెచ్‌–1బీ వీసా స్టాంపింగ్ జాప్యాలు భారతీయ వృత్తి నిపుణుల జీవితాలను తీవ్రంగా అస్తవ్యస్తం చేస్తున్నాయి.