Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

సీఎం పై డీజీపీకి ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీల మధ్య భౌతిక దాడులకు దారితీసేలా సీఎం ప్రవర్తించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ఖమ్మం పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ ఫిర్యాదుకు ప్రధాన కారణం. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలని సీఎం పిలుపునివ్వడంపై శ్రవణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానులను రెచ్చగొట్టి బీఆర్ఎస్‌పైకి ఉసిగొల్పడం ప్రజాస్వామ్య విరుద్ధమని ధ్వజమెత్తారు. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయ పార్టీల మధ్య గొడవలు జరిగితే దానికి రేవంత్ రెడ్డియే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శాంతిభద్రతలకు విఘాతమని, దీనిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.