Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

రాష్ట్రంలో కుంటుపడిన ప్రజా పాలన

రాష్ట్రంలో ప్రజా పాలన పూర్తిగా కుంటుపడిందని, ప్రజల మౌలిక సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యపై సోమవారం ఆయన జలమండలి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, జనవరి నెలలోనే తాగునీటి కొరత ఏర్పడితే రాబోయే వేసవిలో ప్రజల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు.

బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు తాగునీటి కష్టాలు తెలియకుండా పాలన సాగించామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని మల్లారెడ్డి మండిపడ్డారు. వారం రోజుల్లోగా మేడ్చల్ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే వేలాది మందితో భారీ ధర్నా నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు. అభివృద్ధి పనుల పేరిట కేవలం కొబ్బరికాయలు కొట్టడానికే నాయకులు పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆయన విమర్శించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై కూడా ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బేస్‌మెంట్ దశకు చేరుకున్నా నిధులు విడుదల కావడం లేదని, దీంతో లబ్ధిదారులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మేడ్చల్ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్ మరియు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.