నాడు రైతే రాజు: KTR
బీఆర్ఎస్ పాలనలో “రైతే రాజు” అనే నినాదమే లక్ష్యంగా రైతన్నలు గౌరవంగా బతికారనే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు నేరుగా ఇంటికే వచ్చేవని, ఏనాడు తెలంగాణ రైతాంగం కేసీఆర్‌పై కోపంతో లేదని స్పష్టం చేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతుబంధు వచ్చే కాలం పోయి, రాబందుల పాలన వచ్చిందని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా రైతులను పట్టించుకునే వారు కరువయ్యారని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంజాబ్‌ను మించి ధాన్యం పండించిన తెలంగాణను ఇప్పుడు ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. కేవలం చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని నియోజకవర్గాలను కోల్పోయినప్పటికీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నామని నిరూపించారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

