Home Page Sliderhome page sliderTelangana

పల్లె తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పల్లె ప్రజలు ఇచ్చిన గట్టి హెచ్చరిక అని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల గురువారం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ 80 నుండి 90 శాతం స్థానాలు గెలుచుకుంటుందని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా బీఆర్‌ఎస్ మద్దతుదారులు 40 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి జిల్లాలు తిరుగుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా ప్రజలు ఆయనకు ‘గూబ గుయ్యిమనే’ తీర్పు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ, కేసీఆర్ కిట్, దళితబంధు వంటి పథకాలను నిలిపివేసి రేవంత్ ప్రభుత్వం ప్రజలను వంచించిందని, అందుకే జనం తిరుగుబాటు చేశారని హరీష్ రావు విమర్శించారు. పోలీసుల వేధింపులను తట్టుకుని గెలిచిన సర్పంచ్‌లకు ఆయన అభినందనలు తెలుపుతూ, త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.