అచ్చతెలుగు అమ్మాయిల సందడి అట్లతద్ది నేడే
అట్లతద్ది అనగానే బాపు బొమ్మల్లాంటి అచ్చతెలుగు అమ్మాయిలు జడగంటల వాలుజడ, గోరింటాకుతో పండిన ఎర్రటి చేతులు, కాళ్లకు మువ్వల పట్టీలతో ఉయ్యాలలూగడం గుర్తొస్తొంది. తెలుగింటి కన్నెపిల్లలు ఎంతో సందడిగా జరుపుకునే పండుగ అట్లతద్ది. ఆశ్వయుజ మాసం బహుళ కృష్ణ పక్షంలోని తదియ తిథిరోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ తదియ తిథి అక్టోబర్ 9 వ తేదీ గురువారం వచ్చింది. ఈ రోజున మహిళలు ఉపవాసంతో గౌరీ దేవిని, చంద్రుడిని పూజిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి జీవిత భాగస్వామి రావాలని.. వివాహిత స్త్రీలు భర్త దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ నోముని జరుపుకుంటారు. గౌరీదేవి శివుడిని భర్తగా పొందాలనే ఆలోచనతో ఆ కోరిక ఫలించాలని ఈ అట్లతద్ది వ్రతం ఆచరించినట్లు శాస్త్రం చెప్తోంది. ఈరోజున మహిళలు తెల్లవారుజామున నిద్ర లేచి.. స్నానపానాదులు ముగించి ఆకాశంలో చుక్క ఉండగానే చింతకాయ కూర, గోంగూర పచ్చడి, పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, పెరుగులతో అన్నం తింటారు. విస్తరి ముందే నీరుతాగుతారు. తర్వాత ఇక సాయంత్రం పూజ ముగిసేవరకూ ఏమీ తినరు. అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్… అంటూ ఆటపాటలతో గడుపుతారు. ఊయలలు ఊగుతారు.
ఈ రోజున నోము నోచుకునే స్త్రీలు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానించి వారిని కూడా ఉపవాసం ఉంచుతారు. అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు.గౌరీదేవికి ఇష్టమైన కుడుములు, పాలతాలికలు, పులిహోర, అట్లు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ కోసం తోరణాలను రెడీ చేస్తారు. చేతులకు చామంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు. గణపతికి పూజ చేసి తర్వాత లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం చదివి.. అనంతరం అట్లతద్ది వ్రత కథ చదువుతారు. ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున .. గౌరీదేవి వద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు. ఇలా పదేళ్ల పాటు అట్లతద్ది నోము నోచుకుని 11 వ ఏడాది ఉద్యాపనతో పూర్తి చేసుకుంటారు.