home page sliderHome Page SliderInternationalNewsTrending Todayviral

అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్‌చిట్‌

ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఆయన గ్రూప్ కంపెనీలకు సెబీ నుంచి భారీ ఊరట లభించింది. ఈ కంపెనీ స్టాక్‌ అవకతవకలు, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడుతోందంటూ చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 18 నాటి రెండు వేర్వేరు ఉత్తర్వులలో హిండెన్‌ బర్గ్ ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌ పై ఎటువంటి జరిమానా విధించడం లేదని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. సెబీ తీర్పును అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ స్వాగతించారు. తమ గ్రూప్ భారతదేశ సంస్థలు, భారత ప్రజలకు కట్టుబడి ఉందని చెప్పారు. తమ గ్రూప్ ఎల్లప్పుడూ పారదర్శకత, సమగ్రతను కాపాడుతుందని ఆయన అన్నారు. తమపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ సంస్థలపై అదానీ గ్రూప్ నిధులను దారి మళ్లిస్తోందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని సెబీ పేర్కొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు ఆ గ్రూప్‌ నకు చెందిన ఇతర కంపెనీలపైనా హిండెన్‌ బర్గ్‌ సంస్థ 2023 జనవరిలో తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ పవర్‌ లిమిటెడ్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ వంటి లిస్టెడ్‌ కంపెనీల్లో నిధుల మళ్లింపునకు అడికార్ప్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మైల్‌ స్టోన్‌ ట్రేడ్‌ లింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రెహ్వార్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలను అదానీ గ్రూప్‌ వినియోగించిందని హిండెన్ బర్గ్ పేర్కొంది. ఈ ఆరోపణలపై సుదీర్ఘమైన దర్యాప్తు చేపట్టిన సెబీ, మదుపర్లను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని స్పష్టం చేసింది.