చిక్కుల్లో ప్రముఖ సింగర్
ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల బెంగుళూర్లో ఆయన కాన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే. అందులో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఓ అభిమాని తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆయన వెల్లడించారు.సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతున్న సమయంలో ఓ అభిమాని కన్నడలోనే పాడాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన సోనూ పాటలు పాడడం ఆపేసి కన్నడ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. భాషపై తనకు కూడా అభిమానం ఉందన్నారు. కన్నడ భాషను తాను గౌరవిస్తానని చెప్పిన ఆయన.. ఆ అభిమాని తనను బెదిరించినట్లు మాట్లాడటం నొప్పించిందన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం విషాదాన్ని ప్రస్తావించారు. ‘పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం. కచ్చితంగా ఇదే.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగా ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని ఘాటుగా స్పందించారు. సోనూ భాషను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని కన్నడ ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సింగర్పై కొంతమంది ఆడియన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

