రెండ్రోజులుగా ఎయిర్ పోర్టులో నరకం..
ఈ నెల 2న లండన్ నుండి ముంబయికి బయల్దేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం అత్యవసర పరిస్థితులలో తుర్కియేలో దియార్ బకిర్ ల్యాండ్ అయ్యింది. అయితే ల్యాండ్ అయిన తర్వాత దీనిలో సాంకేతిక సమస్య ఎదురయ్యింది. ఈ విమానాశ్రయం మారుమూల ఢిఫెన్స్ ప్రాంతంలో ఉండడంతో ప్రయాణికులు 250 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టులో రెండ్రోజులుగా నరకం అనుభవిస్తున్నారు. వీరిలో 200 మంది భారతీయులు ఉన్నారు. ఎయిర్ పోర్టులో చాలా దారుణంగా ఉందని, ఇన్ని గంటలు గడుస్తున్నా ఎయిల్ లైన్ ప్రతినిధులెవరూ తమను పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సరిపడే ఆహార ప్యాకెట్లు కూడా అందించలేకపోతున్నారని వాపోయారు. అలాగే అక్కడ బాత్‌రూమ్ సౌకర్యాలు కూడా లేవని, ఒక్కటే బాత్‌రూంలో నరకం చూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు కూడా లేవని, చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. త్వరగా విమానం ఏర్పాటు చేసి, తమను ముంబయికి తరలించాలని కోరుతున్నారు. భారత రాయబార కార్యాలయం స్పందించి, ఎయిర్ లైన్స్, దియార్ బాకిర్ ఎయిర్ పోర్ట్ డైరక్టర్‌లతో సంప్రదింపులు జరిపింది. దీనిపై వర్జిన్ అట్లాంటిక్ స్పందించింది. మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణికులను బస్సులో మరో ఎయిర్ పోర్టుకు తరలించి, అక్కడ నుండి ముంబయికి పంపిస్తామని పేర్కొంది.