మంత్రి కోమటిరెడ్డి నిర్వహిస్తున్న ప్రజావాణికి అనూహ్య స్పందన
నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రోజురోజుకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించి అప్పటికప్పుడే వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతంగా నిర్వహించడం, మంత్రి స్వయంగా వ్యక్తిగత సమస్యలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా, అవసరమైన చేయూత నందిస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారు.
ఎన్నికల అనంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం అత్యంత ఆదరణ పొందుతోంది. ప్రజావాణి కొచ్చే అర్జీదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రత్యేకించి ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే స్వయంగా మంత్రి ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు. దీంతో పాటుగా.. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పేదలకు, సహాయం అవసరమైన వారికి, సంస్థలకు పెద్ద ఎత్తున ఆర్ధిక చేయూతను అందిస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు మెడికల్ , ఇంజనీరింగ్ సీట్ల్ ఇప్పించడం, వారికి ఫీజులు చెల్లించడం, ఇంజనీరింగ్ తో పాటు, తక్షణం ఉపాధి కావాలని వచ్చే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇబ్బందుల్లో ఉన్నవారికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేయడం, మహిళలకు కుట్టు మిషన్లు, స్వయం ఉపాధి కల్పన వంటి కార్యక్రమాల అండగా నిలుస్తున్నారు.
అంతేకాదు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికై వచ్చే దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. ప్రత్యేకించి తమతోపాటు, ముఖ్యమైన అధికారులను రెవెన్యూ , పోలీస్, మున్సిపల్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ట్రాన్స్ కో, డిఆర్డిఓ వంటి అధికారులు ప్రజావాణి కి హాజరై అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ప్రజావాణి కార్యక్రమం లో సమస్యలను పరిష్కారం వేగవంతం చేస్తుండడాన్ని గమనించిన నల్గొండ జిల్లా ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు మంత్రి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలి వస్తున్నారు.