కోడలికి కూతురి స్థానం ఇచ్చిన మామ
మధ్యప్రదేశ్‌లో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ ఘటన పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది. కొడుకు క్యాన్సర్‌తో మృతి చెందడంతో, కోడలిని కూతురిగా భావించిన అత్తమామలు ఆమెకు పునర్వివాహం జరిపించి కన్యాదానం చేశారు. భోపాల్‌కు చెందిన దినేష్ బైరాగి కుమారుడు కపిల్‌కు 2018లో ప్రియాంకతో వివాహమైంది. కొంతకాలానికే కపిల్ క్యాన్సర్ బారిన పడగా, ప్రియాంక భర్తకు అండగా నిలిచింది. అయినప్పటికీ 2024లో కపిల్ మరణించాడు. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
అయితే ప్రియాంక జీవితం అక్కడితో ముగియకూడదని భావించిన దినేష్ బైరాగి, ఆమెను కోడలిగా కాకుండా కూతురిగా చూసి కొత్త జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక తల్లిదండ్రులతో చర్చించి వారి అంగీకారంతో పునర్వివాహం ఏర్పాటు చేశారు.
విదిషా జిల్లాకు చెందిన గోవింద్ బైరాగితో ప్రియాంక వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లి ఏర్పాట్ల నుంచి ఖర్చుల వరకు అన్నింటినీ దినేష్ బైరాగి భరించారు. వివాహ వేడుకలో తండ్రి స్థానంలో కూర్చొని స్వయంగా కోడలికి కన్యాదానం చేయడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
ఈ సందర్భంగా ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి స్పందిస్తూ, తమ కుమార్తె భవిష్యత్తు కోసం అత్తమామలు ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జీవితాంతం మరువలేనిదని అన్నారు. ఈ ఘటన సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, మానవత్వం ఇంకా బతికే ఉందనే సందేశాన్ని ఇస్తోంది.

