Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

బీఆర్ఎస్‌పై కవిత సంచలన ఆరోపణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీవీకే -5 భూగర్భ గనిని సందర్శించిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లో ఉన్నట్లు తాను ఆరోపిస్తున్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్మును తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పంచాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి వచ్చినవేనని ఆరోపించిన కవిత, ఆ డబ్బును పంచిన తర్వాతే బీఆర్ఎస్ నేతలు ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. అలాగే రూ.188 కోట్లతో పయనీర్ పత్రికను కొనుగోలు చేసి, తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

అవినీతి అంశాలపై మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి తొలగించారని, తాను కొత్త పార్టీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. తనపై కుట్రలు చేస్తున్నారని, అయినప్పటికీ వ్యక్తిగత విషయాలపై తాను ఎప్పుడూ మాట్లాడనని స్పష్టం చేశారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై కూడా కవిత స్పందించారు. డిపెండెంట్ ఎంప్లాయ్‌మెంట్ కొనసాగించాలని, అన్‌ఫిట్ అయిన కార్మికులు కోరుకున్న వారికి ఉద్యోగం కల్పించేలా ఓపెన్ పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20 నుంచి గోదావరిఖనిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు.