మోదీ చేతుల మీదుగా రిఫైనరీ ప్రారంభం
రాజస్థాన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలో దేశంలోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ– పెట్రోకెమికల్ సముదాయాన్ని ప్రారంభించారు. రూ.79,450 కోట్ల వ్యయంతో హెచ్‌పీసీఎల్, రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టు ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు శుద్ధి, 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ద్వారా దేశ ఇంధన భద్రత బలోపేతం కావడంతో పాటు స్థానికంగా వేలాది ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎల్పీజీ సంక్షోభం ఏర్పడినా భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 35 వేల మెట్రిక్ టన్నుల నుంచి 54 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలిపారు. పీఎన్జీ కనెక్షన్ల విస్తరణతో వంటగ్యాస్‌పై భారం తగ్గిందని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,000 దాటే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ చర్యలతో రూ.950లోపే అందుబాటులో ఉంచగలిగామని పేర్కొన్నారు.
అనంతరం 54 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అలాగే జోధ్‌పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టి, ఇది పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని మోదీ తెలిపారు.

