నోబ్రోకర్ సంచలన నివేదిక
. ఇళ్ల అద్దె డిపాజిట్ల రూపంలో రూ.1.26 లక్షల కోట్లు లాక్
దేశంలో ఇళ్లు లేదా ఫ్లాట్లు అద్దెకు తీసుకునే వారు చెల్లించే ముందస్తు డిపాజిట్లపై ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. దేశంలోని అద్దె ఇళ్ల యజమానుల వద్ద ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల భారీ మొత్తం సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో లాక్ అయిపోయిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ‘నో బ్రోకర్’ తన ‘రెంట్ రిపోర్ట్ 2026’లో వెల్లడించింది. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ ముందస్తు డిపాజిట్ల భారం విషయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఈ జాబితాలో రూ.41,156 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ హబ్ బెంగళూరు రూ.31,628 కోట్లతో రెండో స్థానంలో ఉంది. తర్వాత వరుసగా ఢిల్లీ, చెన్నై, పూణె, హైదరాబాద్ ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో అద్దెదారులు ఈ డిపాజిట్ భారాన్ని భరించలేక నచ్చిన ఇళ్లను వదులుకున్నామని తెలిపారు. అంతేకాక ఇల్లు ఖాళీ చేసే సమయంలో డిపాజిట్ సొమ్మును తిరిగి పొందడం అద్దెదారులకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా చెన్నైలో అత్యధికంగా 11 శాతం మంది అద్దెదారులు.. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పెయింటింగ్, రిపేర్ల పేరుతో యజమానులు తమ డిపాజిట్లలో భారీగా కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ మొత్తం యజమానుల వద్ద నిరుపయోగంగా పడి ఉండటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని నో బ్రోకర్ నివేదిక పేర్కొంది. ఈ సొమ్ము మార్కెట్లోకి వస్తే మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఈక్విటీల రూపంలో పెట్టుబడిగా మారి ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని తెలిపింది. బెంగళూరు ఐటీ కారిడార్లలో అత్యధికంగా 10% నుండి 15% వరకు వార్షిక అద్దెలు పెరిగాయి. బహుళజాతి కంపెనీల విస్తరణ, కార్యాలయాల డిమాండ్ కారణంగా హైదరాబాద్లో కూడా అద్దెలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా ఒప్పందం ముగిసే సమయంలో యజమానులు 5% నుండి 10% వరకు అద్దె పెంచుతుండగా, డిమాండ్ అధికంగా ఉండే ఐటీ కారిడార్లు మెట్రో నగరాల్లో ఈ పెంపు 8% నుండి 15% వరకు ఉంటోందని ఈ నివేదిక వెల్లడిస్తోంది.

