ప్రేమ విషాదం.. ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన
ప్రకాశం జిల్లా (ఏడీఎన్ఎన్) – ప్రకాశం జిల్లాలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి, ప్రకాశం జిల్లా పొందూరు గ్రామానికి చెందిన యువకుడితో గత ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో మనస్తాపానికి గురైన యువతి ముంబైలో ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తన మృతదేహానికి ప్రియుడే తాళి కట్టాలని చివరి కోరికగా పేర్కొన్నట్లు సమాచారం. దీంతో యువతి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ముంబై నుంచి నేరుగా యువకుడి ఇంటికి తీసుకువచ్చి, ఆమె చివరి కోరికను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం తెలిసిన యువకుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన బంధువులు ఇంటి గేటు తాళాలు విరగొట్టి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఉంచి నిరసన చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

